తెలంగాణ, 5 ఫిబ్రవరి (హి.స.)
కుల గణన సర్వే నివేదిక లెక్కల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పథకాల రూపకల్పన చేస్తుందని కులగణన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో బీసీ కులగణనపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ కుమార్ బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుల గణన సర్వే మీద కొందరు అపోహలు.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కుల గణన సర్వే ఎలా జరిగింది అనేది ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వివరిస్తుందన్నారు. స్వాతంత్య్రం తర్వాత ఇంత శాస్త్రీయంగా, లాజికల్ గా దేశంలోని ఏ రాష్ట్రంలో కుల గణన జరగలేదని ఉత్తమ్ తెలిపారు.
కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవద్దని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ వివరణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అన్ని కులాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే జరిగిందని, సర్వేపై ప్రజలు ఎవరికి ఇందులో అపోహలు అవసరం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. మొదట సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చుకున్నారని.. అది పబ్లిక్ డొమైన్ లో లేని డాక్యుమెంట్ అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా చేసుకొని చేసిందేనన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్