విజయవాడ, 12 మార్చి (హి.స.)
తిరుపతి (నగరపాలిక), : తిరుపతి ట్రాఫిక్ సమస్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంత కార్లు, ఇతర వాహనాలు కలిగి ఉన్న వారు సైతం ఆటోలను ఆశ్రయించాల్సిందే. తిరుపతిలో ప్రజా రవాణా వ్యవస్థ అంటే ఆటోలు మినహా మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో జేబుకు చిల్లు తప్పడం లేదు. కూసింత దూరానికీ కనిష్ఠంగా రూ.వంద అడుగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓలా, ర్యాపిడో వంటి ఆన్‌లైన్ రవాణా సేవలపై ఆధారపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సేవలు అందించే రైడర్లలో ఎక్కువగా పురుషులు ఉండటంతో మహిళలు సంకోచిస్తున్నారు. వారికి తమ ఫోన్ నంబర్లు చేరుతాయనే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో బాలికలు, మహిళలకు భరోసా కల్పిస్తూ మెప్మా సభ్యులకు ఉపాధి అందించాలనే లక్ష్యంతో మహిళా రైడర్లను ప్రవేశపెడుతున్నారు. మెప్మా ప్రోత్సాహంతో తిరుపతిలో ప్రాథమికంగా 25 మంది ర్యాపిడో మహిళా రైడర్లు అందుబాటులోకి రానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల