తమిళనాడు, 13 మార్చి (హి.స.)
ఇప్పటికే జాతీయ విద్యా విధానంపై కేంద్రంతో తగువుకు దిగిన తమిళనాడు ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వ బడ్జెట్ నుంచి అధికారిక రూపాయి చిహ్నాన్ని(₹) తొలగించింది. దాని స్థానంలో తమిళ లిపిలో రూపాయి అర్థం వచ్చే అక్షరాన్ని ఉంచింది. దీంతో ఒక రాష్ట్రం జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తిరస్కరించడం ఇదే మొదటిసారి అయింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే నెలకొన్న తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరినట్టు అయింది. ఈ మార్పులు తమిళనాడు వ్యాప్తంగా వివిధ సంఘాలు స్వాగతించగా, డీఎంకె ప్రభుత్వ తీరును బీజేపీ విమర్శించింది. బీజేపీ తమిళనాడు విభాగం చీఫ్ అన్నామలై దీని గురించి మాట్లాడుతూ.. 2025-26 బడ్జెట్లో డీఎంకె ప్రభుత్వం తొలగించిన రూపాయి చిహ్నం ఒక తమిళవ్యక్తి రూపొందించినదని, దీన్ని మొత్తం భారత్ స్వీకరించింది. తమిళుడు రూపొందించిన రూపాయి చిహ్నాన్ని డీఎంకె విస్మరిస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడం స్టాలిన్ మూర్ఖత్వమని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..