విజయవాడ, 14 మార్చి (హి.స.)అగ్ర కథానాయకుడు చిరంజీవి )కి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తోన్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది. మార్చి 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు.
‘పునాదిరాళ్ళు’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ కోసం వర్క్ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల