విజయవాడ, 14 మార్చి (హి.స.)
మర్రిపాడు, పొట్టకూటి కోసం జిల్లాలు దాటి వచ్చాం. రెక్కల కష్టంతో రూ.4 లక్షల వరకు కూడబెట్టుకున్నాం. వారం రోజుల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. అగ్ని ప్రమాదం జరగడంతో సర్వం కోల్పోయామంటూ వలస కూలీలు వాపోయారు. పూరిళ్లు దగ్ధమైన సంఘటన డీసీపల్లిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పొగాకు రైతు సత్యంబాబు వద్దకు బాపట్ల జిల్లా.. కొరిశపాడు మండలం, ప్రాసంగులపాడుకు చెందిన 20 కుటుంబాలు మూడు నెలల క్రితం పనుల నిమిత్తం వచ్చాయి. రోజులాగే గురువారం ఆకు కొట్టుకు వెళ్లగా వారు నివాసముంటున్న పూరిళ్లల్లో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు సిలిండర్లు పేలిపోయాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముగ్గురు మహిళలు స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆటో పూర్తిగా కాలిపోగా, ద్విచక్ర వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఆత్మకూరు సీఐ గంగాధర్, ఏఎస్సై నజీర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 20 కుటుంబాలకు ఇన్‌ఛార్జి తహసీల్దారు అనిల్ కుమార్ సొంత నిధులతో దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వం తరఫున 20 కేజీ చొప్పున బియ్యం అందజేశారు. ఆర్థికసాయం అందేలా చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల