విజయవాడ, 29 మార్చి (హి.స.)
బాపట్ల, రాష్ట్రంలో సూర్యలంకను రెండో బ్లూఫ్రాగ్ బీచ్‌గా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బాపట్ల మండలం అడవిపల్లెపాలెంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసిన వీ వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యలంక బీచ్ ఫ్రంట్ పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం రూ.97.52 కోట్లు మంజూరు చేయటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఒక్క రుషికొండ బీచ్‌కు మాత్రమే బ్లూఫ్రాగ్ గుర్తింపు ఉందని, సూర్యలంకను పరిశుభ్ర, అందమైన రెండో అధునాతన బ్లూఫ్రాగ్ బీచ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణ మాత్రమే కాకుండా సినీ స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించేలా సినీ పెద్దలతో మాట్లాడతామని తెలిపారు. బాపట్ల- చీరాలను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని, రామాపురం బీచ్ ప్రగతికి చర్యలు చేపడతామన్నారు. అంతకుముందు మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాదిలో 50 వేల గదులు నిర్మించటమే లక్ష్యంగా బీచ్ రిసార్ట్స్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న నాలుగేళ్లలో దేశంలో రాష్ట్రాన్ని పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తామని, పర్యాటకం ద్వారా ఏటా ఇరవై శాతం వృద్ధి సాధించనున్నట్లు తెలిపారు. ఈ రంగంలో యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించటమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల