దిల్లీ, 29 మార్చి (హి.స.)
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను ఆ పార్టీ ఎంపీలు దిల్లీలో ఘనంగా జరుపుకున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సహా టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు.
అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు దార్శనికత, లోకేశ్ పట్టుదల, కార్యకర్తల కష్టం వల్ల టీడీపీ దేశంలోనే కీలకపాత్ర పోషించే స్థితికి చేరింది. ఎలాంటి కష్టాలు వచ్చినా టీడీపీ తట్టుకొని నిలబడింది.
చంద్రబాబు నాయకత్వంలో కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటున్న పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ మాకు కన్నతల్లి వంటిది. ఎన్నో సవాళ్లు, కష్టాలను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. దేశ రాజకీయాల్లోనే టీడీపీ కీలకపాత్ర పోషిస్తోంది. తెలుగువాళ్లు ఎక్కడున్నా పార్టీ అక్కున చేర్చుకుంటోంది. విజన్ -2047 స్వర్ణాంధ్రతో కొత్త అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. 9 నెలల కాలంలో రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు కొత్త వెలుగు చూస్తున్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. కార్యకర్తలే పార్టీని నడిపించే రథసారథులు అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి