కర్నూల్, 29 మార్చి (హి.స.)
ఉగాదిలో ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.
తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు
ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా చేసే ఉగాది పచ్చడి అంతరార్థం ఏమిటో మీకు తెలుసా? ఉగాది పచ్చడిలో షడ్రుచులు దేనికి సంకేతం? ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకు వేస్తారు? ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి? ఈ ఆసక్తికరమైన విషయాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైనా స్పెషల్గా పిండివంటలు, గారెలు, బూరెలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే! తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ ఉగాది పచ్చడి.
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు - కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
నూతన సంవత్సరంలో ఉగాది పచ్చడి తినేటప్పుడు తప్పకుండా చదువాల్సిన శ్లోకం ఇదే!
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥
ఉగాది రోజున అభ్యంగ స్నానం చేసి.. ఉగాది పచ్చడి చేసి.. పరగడుపున అల్పాహారంగా తీసుకుంటారు. ఉగాది పచ్చడి .. ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెబుతుంది. మనిషి జీవితంలో ఉండే ఎదురయే కష్ట సుఖాలను ఒకేరీతిన చూడాలని సూచిస్తుంది.
అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు!!
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి