విజయవాడ, 18 ఏప్రిల్ (హి.స.)
పామిడి/అగళి, ఏప్రిల్ 18: అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు బైక్ ప్రమాదాలలో ఇద్దరు యువకులు మృతిచెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పామిడి సమీపంలో బైక్ అదుపుతప్పి సుమంత్ (25) అనే యువకుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి శివప్రసాద్.. పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి కొడుకు మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ‘రేయ్ నాన్నను వచ్చాను లేవరా.. మీ అమ్మ వచ్చేవరుకైనా ఉండురా.. మీ అమ్మకు నేను ఏమని సమాధానం చెప్పాలిరా..’ అంటూ ఒక్కగానొక్క కొడుకు సుమంత్ మృతదేహంపై పడి కన్నీరు మున్నీరయ్యారు.
అనంతపురం నగరంలోని అశోక్ నగర్ చెందిన శివప్ర సాద్ కుమారుడు సుమంత్ టీ కేఫ్ నిర్వహించేవాడు. గుంతకల్లు నుంచి అనంతపురానికి వెళుతుండగా పామిడి శివారులోని అయ్యప్పస్వామి గుడి వద్ద బైక్ అదుపుతప్పింది. 44వ జాతీయ రహదారిపై కల్వర్టుకు ఢీకొట్టడంతో సుమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి.. ఆస్పత్రికి వచ్చి గుండె పగిలేలా ఏడ్చారు. మరో ప్రమాదంలో.. అగళి మండలం మధుడి గ్రామానికి చెందిన మంజునాథ్(25) మృతిచెందాడు. కర్ణాటక లోని హసన్ మంజునాథ్ బేకరిలో పని చేసేవాడు. స్వగ్రామానికి గురువారం వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల