విజయవాడ, 18 ఏప్రిల్ (హి.స.)
: అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో దానిని అత్యవసరంగా దించి వేయాల్సి వచ్చింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్‌ల ప్రకారం.. రాత్రి 8:05 గంటల సమయంలో డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి UA2325 విమానం ఎడ్మింటన్‌కు వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కుడి రెక్క కింద ఉన్న ఇంజిన్ నుంచి భారీగా మంటలు రావడం మొదలయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు తీవ్రమవడంతో పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దింపేశామని.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. విమానానికి కుడివైపున ఉన్న ఇంజిన్‌లో కుందేలు చిక్కుకుపోవడంతో (rabbit strike) మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో ఎడ్మింటన్‌కు తరలించామన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 153 మంది ఉన్నారు. వారిలో చాలామంది మంటలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. విమానం ఎగురుతున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని అప్పుడే కుందేలు అందులోకి వెళ్లినట్లుదంని ఓ ప్రయాణికుడు పేర్కొన్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల