మహబూబ్‌నగర్ , 20 ఏప్రిల్ (హి.స.)జిల్లా దేవరకద్రలో బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు కుట్ర చేశారు. కర్నూల్, కర్ణాటక రౌడీ షీటర్లు ప్రశాంత్ రెడ్డిని చంపేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన వారే ప్రశాంత్ రెడ్డిని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఆయన్ను చంపేందుకు రూ. 2.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు.. తనను హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించారని ఆరోపిస్తూ ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసు పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండటంతో ప్రశాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ హత్యకు కుట్ర చేస్తున్నది ఎవరనేది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు