విజయవాడ, 22 ఏప్రిల్ (హి.స., దిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన సోమవారం అర్ధరాత్రి దిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 2న అమరావతికి వస్తున్న నేపథ్యంలో అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి చంద్రబాబు కేంద్ర హోం మంత్రికి వివరించనున్నట్లు సమాచారం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానించి పంపిన నేపథ్యంలో దాని పురోగతి గురించి న్యాయ శాఖ మంత్రితో చర్చించే వీలుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల