న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.)
స్వాతంత్య్ర సమరయోధులను అపహస్యం చేయవద్దని లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది.
సావర్కర్ ను ఉద్దేశించి గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇవే తరహా వ్యవహరిస్తే మేమే స్వయంగా విచారణ చేపడతామని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం మండిపడింది. సావర్కర్ ఆంగ్లేయుల సర్వెంట్ అని, సావర్కర్ బ్రిటిష్ వారి నుండి పెన్షన్ పొందారని 2022 లో రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై న్యాయవాది నృపేంద్ర పాండే లక్నో మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా 12 డిసెంబర్ 2024న లక్నో మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయగా ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయాడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ ఫిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి