వరంగల్ , 7 ఏప్రిల్ (హి.స.) క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయగా.. వారిచ్చిన సమాచారంతో ఏపీకి చెందిన ఓ బుకీని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు.
ఆదివారం హనుమకొండ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ దేవేందర్‌రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పది రోజుల కిందట హనుమకొండ పద్మాక్షికాలనీలో క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతున్న కొందరిని పోలీసులు పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో బుకీగా వ్యవహరిస్తున్న ఏపీలోని కాకినాడకు చెందిన వీరమణికుమార్ ఆదివారం హనుమకొండకు రాగా అరెస్టు చేశారు. 2023లో గోవాకు వెళ్లిన సమయంలో హైదరాబాద్‌కు చెందిన బుకీ యోగేశ్‌గుప్తాతో వీరమణికి పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల గురించి చెప్పి మీరు కూడా పందేలు కట్టిస్తే వచ్చిన లాభంలో 9% ఇస్తానని చెప్పాడు. వీరమణి అంగీకరించడంతో యాప్ లింక్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చాడు. వాటి ద్వారా పలువురితో బెట్టింగులు కట్టిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటి వరకు వీరమణి బ్యాంకు ఖాతాల్లో రూ.5 కోట్ల వరకు జమ కాగా.. అందులో యోగేశ్‌కు రూ.3 కోట్లు, బెట్టింగుల్లో గెలిచిన వారికి రూ.కోటి ఇచ్చి, మిగిలిన రూ.కోటితో కాకినాడలో ఒక ఫ్లాటు కొనడంతోపాటు రెండు మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు. అతన్ని అరెస్టు చేసి, రూ.1.50 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, యోగేశ్‌గుప్తా పరారీలో ఉన్నాడని ఏసీపీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల