న్యూఢిల్లీ, 8 మే (హి.స.)
ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితికి స్పందించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. జమ్ముకశ్మీర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు, సిక్కిం ప్రభుత్వ ప్రతినిధితో అమిత్ షా సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ జరిగిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దవని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని ఆదేశించింది. నకిలీ కథనాలను ప్రచారం చేసే ఖాతాలను బ్లాక్ చేయాలని సూచించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దేశ వ్యతిరేక ప్రచారంపై కఠినంగా నిఘా ఉంచాలని అధికారులను కోరారు. తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర సంస్థలతో సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..