విజయవాడ, 8 మే (హి.స.)
అమరావతి: ఏపీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సిద్ధమవుతోంది. వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలించారనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగ ప్రవేశం చేసేందుకు చర్యలు చేపట్టింది. మద్యం కేసుకు సంబందించిన వివరాలను తమకు అందజేయాలని సిట్ చీఫ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు ఈడీ లేఖ రాసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ లేఖలో పేర్కొంది.
మద్యం కుంభకోణంపై సీఐడి అధికారులు నమోదు చేసిన 21/2024 ఎఫ్ఐఆర్‌కి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. సీఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని లేఖలో తెలిపింది. ఈ కేసుతో సంబంధం ఉందని ఇప్పటివరకు దర్యాప్తు అధికారులు గుర్తించిన వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు తమకు అందజేయాలని కోరింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులపై అభియోగపత్రం నమోదు చేస్తే వాటి కాపీలను సైతం ఇవ్వాలని లేఖలో కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల