విజయవాడ, 9 మే (హి.స.)
: భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్థాన్.. తన ఉనికిని చాటుకొనేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. దీంతో అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అలజడి దృష్ట్యా అక్కడినుంచి బయట ప్రాంతాలకు వెళ్లేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే భారతీయ రైల్వే ) కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ, ఉధంపుర్ నుంచి దిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్ మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్‌అవుట్ పాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల