అమరావతి, 18 జూలై (హి.స.)
బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. ఎక్కడికక్కడ జిల్లా పరిధిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్న బస్సులెన్ని? ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఉచిత పథకం అమల్లోకి వస్తే రద్దీ ఎంతమేర పెరుగుతుంది? తదితర అంశాలపై అంచనాలు సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తెస్తోంది. పెరిగే రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని ఇటీవల సీఎం ఆదేశించారు. ఇందుకు కొత్త బస్సులు కొనుగోలు చేయడం లేదా అద్దె బస్సులను తీసుకోవడంపై చర్చించిన నేపథ్యంలో అధికారులు లెక్కలు తీస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని ఇప్పటికే మంత్రుల కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించిన విషయం విదితమే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ