న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్తో నాయకత్వ తగాదాలు ఎదురుకుంటున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు కేసులో సీఎం సిద్దరామయ్య భార్య బీఎం పర్వతికి జారీ చేసిన సమన్లను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసిన అప్పీల్ను సుప్రీం కోర్టు సోమవారం తోసివేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయి, న్యాయమూర్తి కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం, హైకోర్టు మార్చి 7న ఇచ్చిన తీర్పును నిలుపుతూ, రాజకీయ పోరాటాలు కోర్టు గదుల్లో కాదు, ప్రజల్లో జరగాలి” అని వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాల్లో ఈడీ జోక్యం పట్ల న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో నాకు కొంత అనుభవం ఉంది. దయచేసి మమ్మల్ని ఏదైనా మాట్లాడేలా చేయవద్దు. లేదంటే ఈడీపై మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయ పోరాటాలు ప్రజల్లో జరగాలి, ఇలాంటి వాటికి ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు?” అని ధర్మాసనం స్పష్టం చేసింది
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..