హైదరాబాద్, 3 జూలై (హి.స.)
తెలంగాణలో నిర్వహించిన కులగణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బయటపెట్టాలని డిమాండ్ చేస్తుంటే వాటిని బయట పెట్టకుండా 'కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్- సీబీఐ’ పేరుతో స్వతంత్ర కమిటీ పేరుతో మళ్లీ పాత లెక్కలనే ప్రభుత్వం ఇస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. కులగణన విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజమైనవే అనే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటే గ్రామ పంచాయతీల వారీగా గణాంకాలు బయటపెట్టాలని చాలెంజ్ చేశారు. బీసీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనే డిమాండ్ తో ఈ నెల 17న తెలంగాణ జాగృతి, యూనైటెడ్ ఫ్రంట్ ఫూలే ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను కవిత ఇవాళ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత ప్రభుత్వం ఇదివరకే షమీమ్ అక్తర్, బూసాని కమిటీలను వేసి వివరాలు బయటపెట్టలేదు. కులగణన వివరాలను గ్రామాల వారీగా బయటపెట్టకుండా మీడియాకు మళ్లీ తప్పుడు లెక్కలు ఇస్తున్నారని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్