హైదరాబాద్, 3 జూలై (హి.స.)
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కాదా అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ కు హరీశ్ రావు సిద్ధం కావాలని అన్నారు. ఆధారాలతో సహా అన్ని లెక్కలను సభలోనే బయటపెడతారన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. గతంలో తెలంగాణ సీఎంగా ఉంటూ చంద్రబాబు, జగన్ తో చెట్టపట్టాలేసుకుని ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. పక్కరాష్ట్రాలు బాగుపడితే మంచిదే కానీ మన రాష్ట్ర వాటా విషయంలో రాజీపడి ఇప్పుడు మాట్లాడుతారా అని మండిపడ్డారు. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తెస్తేనే బనకచర్ల ఆగిందన్న విషయం హరీశ్ రావు గుర్తుంచుకోవాలన్నారు. మా ప్రభుత్వ ప్రయత్న తెలిసి కూడా అబద్ధాలతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్