భద్రాచలం, 8 జూలై (హి.స.)
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవిపై భూ కబ్జాదారులు దాడి చేశారు. దాడిలో ఆలయ ఈవో స్పృహ తప్పి పడిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది, స్థానికులు ఈవో రమాదేవిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో ఆమె తేరుకున్నారు. భద్రాచలం ఆలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో కొద్ది రోజులుగా ఆక్రమణదారులకి, దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి పురుషోత్తపట్నంలో 889.50 ఎకరాల భూమి ఉంది. ఆలయ భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి.. ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఈరోజు ఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూకబ్జాదారుల నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది, భూకబ్జా దారులమధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈవో రమాదేవిపై కబ్జాదారులు దాడి చేశారు. దాడిలో ఆమె స్పృహ కోల్పోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ