అమరావతి, 8 జూలై (హి.స.)ఎడతెరిపిలేని అతిభారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. దక్షిణాదిన అక్కడక్కడ మించి పెద్దగా వాన జాడ కనిపించడం లేదు. ఈ క్రమంలో మధ్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్గడ్, దక్షిణ ఝార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టం నుంచి 3.1- 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగాల రెండు రోజులు తెలంగాణలోని చాలా జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు (జులై 8) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఏపీకి మరో రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రాబోయే 2 రోజుల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. దీంతో ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి