వైసీపీ నేత నల్లపురెడ్డి ఇంటిపై దాడి.. కారు, ఇంట్లో సామాగ్రి ధ్వంసం
నెల్లూరు 8 జూలై (హి.స.)నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై కొందరు దుండగులు నిన్న రాత్రి దాడికి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కారును ధ్వంసం చేయడంతో పాటు, ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్, క
వైసీపీ నేత నల్లపురెడ్డి ఇంటిపై దాడి.. కారు, ఇంట్లో సామాగ్రి ధ్వంసం


నెల్లూరు 8 జూలై (హి.స.)నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై కొందరు దుండగులు నిన్న రాత్రి దాడికి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కారును ధ్వంసం చేయడంతో పాటు, ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్, కుర్చీలను విరగొట్టారు. కిటికీ అద్దాలను పగులగొట్టి, దుస్తులను బయటకు తీసుకొచ్చి తగులబెట్టారు. ఈ దాడి జరిగిన సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరు.

నిన్న మధ్యాహ్నం తెదేపా మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొవ్వూరు నియోజకవర్గ వైకాపా విస్తృత స్థాయి సమావేశం పడుగుపాడులోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో పాటు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు.

ఈ దాడి గురించి సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు అనిల్ కుమార్ యాదవ్, ఆనం విజయకుమార్ రెడ్డి, మేరిగ మురళీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దాడికి తెదేపా నాయకులే కారణమని ఆరోపిస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫర్నీచర్, కారు ధ్వంసం చేసిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande