అమరావతి 9 జూలై (హి.స.) ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ప్రధానంగా రాజధాని ప్రాంతంలో 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలానే నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాలు ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలానే కేంద్రం పలు అభ్యంతరాలతో వెనక్కు పంపిన బనకచర్ల ప్రాజెక్టు అంశం, సుపరిపాలన .. తొలి అడుగు కార్యక్రమాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి