ఆధారాలైనా చూపండి.. క్షమాపణైనా చెప్పండి
భారత ఎన్నికల సంఘం’ (ఈసీఐ) డిమాండ్‌
ఆధారాలైనా చూపండి.. క్షమాపణైనా చెప్పండి


దిల్లీ:న్యూఢిల్లీ: , 18 ఆగస్టు (హి.స.) ఓట్ల చోరీ జరిగిందంటూ పదేపదే ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దానికి తగ్గ ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని ‘భారత ఎన్నికల సంఘం’ (ఈసీఐ) డిమాండ్‌ చేసింది. ఆయన వద్ద ఆధారాలుంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీచేసింది. అలా చేయనిపక్షంలో ఆరోపణల్ని నిరాధారంగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని తేల్చిచెప్పారు. ఎలాంటి ఆధారాల్లేకుండా ఓటర్లపై నకిలీలనే ముద్రవేసే ఎత్తులను తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లపై రాహుల్‌ ఫిర్యాదు చేసినందున వారంలోపు తప్పనిసరిగా ప్రమాణపత్రం దాఖలుచేసి, ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఓట్ల చోరీపై రాహుల్‌ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేశ్‌ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్‌సింగ్‌ సంధు, వివేక్‌జోషీతో కలిసి 85 నిమిషాలసేపు మీడియాతో మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande