న్యూఢిల్లీ: , 18 ఆగస్టు (హి.స.)
ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం లక్ష్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ (CEC Gyanesh Kumar)పై అభిశంసనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి (Impeachment notice). దానికి సంబంధించి నోటీసును తీసుకువచ్చేందుకు ప్రతిపక్ష సభ్యులు యోచన చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ వ్యవహారంపై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ మీడియాకు వెల్లడించారు. సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అయితే ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో అంతమంది సభ్యులు లేరు.
ఇదిలాఉంటే.. ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్‌సింగ్ సంధు, వివేక్‌జోషీతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ తగిన ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ