న్యూఢిల్లీ,31 ,ఆగస్టు (హి.స.)భారత్‌పై సుంకాల (Tariffs On India) విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) తీసుకుంటున్న నిర్ణయాలను యూఎస్ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు రిక్ సాంచెజ్ (Rick Sanchez) తప్పుబట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై అధిక సుంకాలు విధించడం అజ్ఞానమే అవుతుందన్నారు. అమెరికా అధ్యక్షుడు కొన్ని విషయాల్లో దూరదృష్టితో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారని.. కానీ వాటినే తెలివైన నిర్ణయాలు అనుకుంటారని మండిపడ్డారు. స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లాడిలా భారత్‌ను భావించి.. తాను ఏది చెప్పినా ఆ దేశం వింటుందని ట్రంప్ అనుకుంటున్నారని రిక్ సాంచెజ్ ఎద్దేవా చేశారు. కానీ భారత్ పరిణతి చెందిన యువకుడిలాంటిదని.. తమ దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో దానికి తెలుసన్నారు.
తాము ఎవరి నుంచి చమురు కొనాలో వద్దో అమెరికా (US) చెప్పాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసిందని.. దీని వల్ల ప్రపంచ పరిస్థితులు మారే అవకాశం ఉందని రిక్ సాంచెజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల అమెరికా తన పతనాన్ని కోరి తెచ్చుకుంటుందన్నారు. అదనపు సుంకాలు విధించడాన్ని యూఎస్ ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ