రాంచీ/న్యూఢిల్లీ,31 ,ఆగస్టు (హి.స.) లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ పార్టీలకు అతీతంగా.. యోగ్యత ప్రాతిపదికన తనకు మద్దతు తెలపాలని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఎంపీలందరికీ లేఖలు రాసినట్లు తెలిపారు. భాజపాకు చెందిన ఉన్నతస్థాయి నాయకత్వాన్ని కలిసి మద్దతు కోరడానికి తాను సిద్ధమేనని, ఆ పార్టీ నేతలు అనుమతిస్తే వారిని కలుస్తానని శనివారం రాంచీలో చెప్పారు. దేశంలో ఇటీవలి కాలంలో అత్యంత హుందాగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వహించిన ఎన్నికగా ఇది మిగిలిపోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను నిర్బంధించిన కేంద్ర ప్రభుత్వ చర్యను ఆయన ఖండించారు. ‘‘రాజ్యాంగ పదవుల్లో ఉంటూ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని కేసులో ఇరికించినవారు ముఖ్యమంత్రిని చిత్రహింసలకు గురిచేశారు. ఆయన గౌరవానికి భంగం కలిగించారు. పౌరుల మాదిరిగానే ముఖ్యమంత్రికి రాజ్యాంగం ప్రసాదించిన గౌరవానికి భంగం కలిగించినవారు దీనికి బాధ్యత వహించాలి’’ అని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ