న్యూ ఢిల్లీ, 31 ఆగస్టు (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఫుల్ స్టాప్ పడ్డ పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా మోదీ.. చైనాలో అడుగుపెట్టారు. ఎప్పట్నుంచో భారత్‌తో సంబంధాల కోసం ఎదురుచూస్తున్న చైనా కూడా మోదీ పర్యటనకు ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంచితే, భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ సుంకాలను 50 శాతం పెంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చైనాకు చెందిన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ఎయిమర్ టాన్‌జెన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్‌కు కనీసం బుర్ర ఉంటే భారత్‌పై ఆ విధంగా సుంకాలు విధించే వాడు కాదంటూ మండిపడ్డారు. ప్రపంచ మార్కెట్ పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా భారత్ అతి పెద్దదని, అటువంటి దేశంపై ట్రంప్ విజ్ఞత లేకుండా వ్యవహరించి తప్పు చేశాడన్నారు . ట్రంప్ తన బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవడం, అందులోనూ భారత్ లాంటి దేశంపై సుంకాలతో కాలు దువ్వడం వంటిది అమెరికాకే మంచిది కాదన్నారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-మోదీల మధ్య జరుగుతున్న చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు