తెలంగాణ, కరీంనగర్. 16 సెప్టెంబర్ (హి.స.) ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ క్రింద భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా కల్పించారు. గంగాధర మండలం నారాయణపూర్, మంగపేట గ్రామస్తులు మంగళవారం ఎమ్మెల్యేను గంగాధరలోని ప్రజా కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం అందించడానికి ప్రభుత్వం రూ. 23 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే వివరించారు. త్వరలోనే నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని భరోసా కల్పించారు. ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు