హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.) బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ఈ పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..