
హైదరాబాద్, 14 జనవరి (హి.స.)
తెలుగు రాష్ట్రాల ప్రజల జీవన విధానానికి, గ్రామీణ సంస్కృతికి, వ్యవసాయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి. ఏడాది పాటు రైతు చేసిన కష్టానికి ఫలితం దక్కే ఈ పర్వదినం కుటుంబాలను, గ్రామాలను, సమాజాన్ని ఒక్కటిగా కలిపే మహత్తర ఉత్సవం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సందర్భం ఆశావహమైన కొత్త ఆరంభాలకు సంకేతంగా నిలుస్తుంది.
అన్నదాతకు గౌరవం తెలిపే ఈ పండుగ వేళ, దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతుల పాత్రను మనమందరం గుర్తు చేసుకోవాలి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తీసుకొచ్చిన పథకాలు రైతులకు భరోసా ఇస్తున్నాయి. సాగునీటి సదుపాయాల విస్తరణ, పంటల బీమా, రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం వంటి చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తున్నాయి.
సంక్రాంతి మనకు కేవలం పండుగ మాత్రమే కాదు… క్రమశిక్షణ, కృషి, సహకారం వంటి విలువలను గుర్తు చేసే సందర్భం. యువత విద్యలో, నైపుణ్యాల్లో ముందుకు సాగాలి. మహిళలు స్వావలంబనతో కుటుంబం, సమాజ పురోగతికి మరింత బలం చేకూర్చాలి. సంప్రదాయాలను కాపాడుకుంటూ, అభివృద్ధి మార్గంలో కలిసి నడిస్తేనే తెలంగాణ, దేశం మరింత బలపడతాయి.
ఈ శుభవేళ ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి వెల్లివిరియాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సమృద్ధిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు