
ఢిల్లీ, 29 జనవరి (హి.స.)కొలిమిలో కాలితేనే ఇనుము ఉక్కు అవుతుంది. అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడే కొత్త అవకాశాలకు దారులు తెరుచుకుంటాయి. అమెరికా టారిఫ్ యుద్ధం కూడా భారత్‌కు సరిగ్గా అలాంటి అవకాశాలే ఇచ్చాయి.. అగ్రరాజ్యాల మధ్య చిక్కుకుని విలవిల్లాడిపోకుండా తట్టుకుని నిలబడినందుకే యూరప్ మార్కెట్ ఇప్పుడు భారత్‌కు తలుపులు తెరిచింది.
కరోనా సమయంలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఈయూ వంటి అగ్రదేశాలు కూడా ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వ డానికి సిద్ధంగా లేని సమయంలో భారత్ చూపిన దాతృత్వానికి ప్రపంచం మొత్తం విశ్వగురుగా ప్రశంసించింది. టారిఫ్‌ల పేరిట ట్రంప్ చూపిస్తున్న తెంపరితనాన్ని సంయమనంతో ఎదుర్కొంటున్న తీరు ఇప్పుడు భారత్‌ను విశ్వ మిత్రగా మార్చనున్నది. 2026 ప్రారంభంలో భారత్ తీసుకుంటున్న దౌత్యపరమైన నిర్ణయాలు ప్రపంచ గమనాన్ని మార్చివేయబోతున్నాయి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 జనవరిలో భారత్‌కు ఒక కీలక ఆహ్వానాన్ని పంపారు. గాజాలో శాంతి స్థాపన, పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో సభ్యదేశంగా చేరాలని ప్రధాని మోడీని కోరారు. ఐక్యరాజ్యసమితి విఫలమైన చోట, భారత్ వంటి దేశాల మద్దతుతో ఒక కొత్త శాంతి యంత్రాంగాన్ని నిర్మించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌తో ఎంత శక్తిమంతమైన సంబంధాలు ఉన్నాయో.. అలాగే అరబ్ దేశాలతో సమానమైన సంబంధాలు ఉన్న ఏకైక దేశం భారత్ కావడంతో మన ఉనికి ఈ బోర్డుకు కీలకంగా మారింది. ప్రపంచంలోని మెజారిటీ దేశాలను ఒప్పించే సత్తా కేవలం భారత్‌కు మాత్రమే ఉన్నదని అమెరికా నమ్ముతున్నది అందుకే రాజీ మార్గాలు వెతుకుతున్నది. టారిఫ్ రాయితీలు పూర్తిగా అందులో భాగమే.
18 ఏళ్లకు ఈయూ గ్రీన్‌సిగ్నల్..
యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ డీల్ కోసం భారత్ 2007 నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, భారత్ చమురు శుద్ధిలో ప్రపంచంలోనే నంబర్ వన్ కావడంతో ఈయూ తనకు తానే మన వద్దకు వచ్చింది. భారత్‌తో ఫ్రీ ట్రేడ్‌కు సిద్ధమైంది. దీనివల్ల రష్యా ఆయిల్ నేరుగా భారత్ టూ యూరప్‌కు ఎగుమతి అవుతుంది. యూరప్‌లోని 27 దేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలు పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించి, భారత్‌లో పెట్టుబడులు పెంచుతున్నాయి. అమెరికా సుంకాల వల్ల ఏర్పడిన లోటును ఈయూ పూడ్చనున్నది. దీనివల్ల అమెరికాని ఎదిరించి ఇండియా మార్కెట్ డైవర్సి ఫికేషన్ తీసుకురాబోతున్నది. పైగా చైనా ప్లస్ వన్‌గా (చైనాకు ప్రత్యామ్నాయం) ఈయూ మనదేశాన్ని ఎంచు కున్నది. భారత్ చొరవతోనే ఆఫ్రికా సమాఖ్యకు జీ-20లో శాశ్వత సభ్యత్వం లభించింది. నేడు ఆఫ్రికా ఖండం మొత్తం భారత్‌ను తమ ‘పెద్దన్న’గా, తమ సమస్యలను ప్రపంచ వేదికపై వినిపించే గొంతుకగా చూస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV