
పాలమూరు, 17 అక్టోబర్ (హి.స.)
పాలమూరుకు నీళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు నీళ్ల విషయంలో వెనక్కి
తగ్గేదే లేదని అవసరమైతే తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోనైనా యుద్ధం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రాంత ప్రయోజనాలే తనకు ముఖ్యమని అన్నారు.
శనివారం జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిరుద్ రెడ్డి మాట్లాడారు.పాలమూరుకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోసం తన ప్రాణాలైనా ఇస్తానని, కానీ పాలమూరు నీళ్లను తరలించుకుపోతే మాత్రం సహించబోనని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాలకు నీటి కేటాయింపుల వ్యవహారంపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించే ప్రతిపాదనను తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ముందుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరుకు నీళ్లు అందించాలని, ఆ తర్వాతే డిండి ప్రాజెక్టుకు నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కేవలం 60 శాతం మాత్రమే జరిగాయని ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు