
కృష్ణా జిల్లా , 25 అక్టోబర్ (హి.స.)
కృష్ణా జిల్లాలోని పామర్రు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జగ్గయ్యపేటకు చెందిన చిన్న తిరుపతమ్మ (60) ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది.
వివరాల ప్రకారం.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై గుడివాడ రోడ్డు పైవంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్న తిరుపతమ్మ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. కారులో ఉన్న మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కారులో ప్రయాణిస్తున్న వారు మోపిదేవి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్