సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక – దీపావళి నకిలీ గిఫ్ట్ లింకుల పట్ల అప్రమత్తత
పండుగల సీజన్ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్న నూతన మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరిక జారీ చేసింది.
Cyber


హైదరాబాద్ , 30 అక్టోబర్ (హి.స.)

పండుగల సీజన్ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్న నూతన మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం వాట్సాప్, టెలిగ్రామ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దీపావళి పండుగ కానుకగా ప్రభుత్వం/ప్రముఖ కంపెనీలు ఉచితంగా రూ. 8,000 క్యాష్బ్యాక్ లేదా ఉచిత బహుమతులు ఇస్తున్నాయి అంటూ ఒక మెసేజ్ విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆ మెసేజ్తో పాటు ఒక లింక్ (Phishing Link) ను పంపి, దానిని క్లిక్ చేసి కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వెంటనే డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని ఆశచూపుతున్నారు.

ఈ నకిలీ మెసేజీలపై స్పందించిన అధికారులు, అవన్నీ ప్రజల వ్యక్తిగత డేటా మరియు బ్యాంకింగ్ వివరాలను దొంగిలించడానికి రూపొందించిన 'ఫిషింగ్ లింకులు' అని తేల్చిచెప్పారు. వినియోగదారులు ఆ లింక్ క్లిక్ చేయగానే వారి ఫోన్లలో మాల్వేర్ (APK ఫైళ్లు) డౌన్లోడ్ అవ్వడం కానీ, లేదా బ్యాంక్ వివరాలు నమోదు చేయమని అడిగి క్షణాల్లో ఖాతాల్లోని సొమ్మును ఖాళీ చేయడం కానీ జరుగుతుందని వివరించారు. ఎవరూ కూడా ఇటువంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, తమ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 ఉచిత హెల్ప్లైన్ నంబర్కు లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande