
విశాఖపట్నం , 30 అక్టోబర్ (హి.స.)
విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ పరిధిలో ఈరోజు మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. సీ హార్స్ జంక్షన్ సమీపంలోని జె.ఎం. భక్షి కంపెనీ నిర్వహిస్తున్న ఐరన్ ఓర్ రవాణా కన్వేయర్ బెల్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. కన్వేయర్ బెల్ట్ వెంట మంటలు వ్యాపించకుండా నీటి జెట్లు, ఇతర పరికరాలను ఉపయోగించి అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని తాత్కాలికంగా ఖాళీ చేయించి భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. అయితే కన్వేయర్ బెల్ట్‌కు కొంత నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు ఎలా చెలరేగాయనే విషయంపై అధికారులు ప్రాథమికంగా విచారణ ప్రారంభించారు. విద్యుత్ లోపమా, యంత్రాల సాంకేతిక సమస్యా అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఆ ప్రాంతంలో కార్యకలాపాలను జాగ్రత్తగా కొనసాగించాలని సంబంధిత అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్