
హైదరాబాద్ , 30 అక్టోబర్ (హి.స.)
ప్రజల ఆరోగ్యంతో లాభాపేక్ష కోసం ఆడుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఆహార తయారీ కేంద్రాలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సమరశంఖం పూరించారు. 'టీజీ-సేఫ్' (TG-SAFE) ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ మరియు రంగారెడ్డి జిల్లాల పరిధిలో 10 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఒకేసారి 20 ప్రముఖ ఆహార తయారీ కేంద్రాల్లో మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పరిశుభ్రత పాటించకపోవడం, కుళ్ళిపోయిన/గడువు ముగిసిన కూరగాయలు, నాణ్యత లేని నూనెలు, నిషేధిత కెమికల్ కలర్లు మరియు నిల్వ ఉంచిన మాంసాన్ని వంటకాల కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు ప్రత్యక్షంగా గుర్తించారు.
ఈ సోదాల్లో భాగంగా నాణ్యతా ప్రమాణాలు పాటించని కేంద్రాల నుంచి దాదాపు రూ. 5.89 లక్షల విలువైన 5,555 కిలోల (5.5 టన్నులు) కల్తీ మరియు ప్రమాదకర ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని వెంటనే ధ్వంసం లేదా సీజ్ చేశారు. కిచెన్ ఏరియాల్లో ఈగలు, బొద్దింకలు ఉండటం, వంట చేసే సిబ్బంది గ్లౌజులు, హెడ్ క్యాప్‌లు ధరించకపోవడం, వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించిన పలు యజమానులకు కఠిన నోటీసులు జారీ చేయడమే కాకుండా, సేకరించిన ఆహార నమూనాలను తదుపరి రసాయన విశ్లేషణ కోసం ప్రభుత్వ ల్యాబ్‌లకు పంపించారు. ల్యాబ్ నివేదికలు ఆధారంగా సదరు హోటళ్లు, కేటరింగ్ సెంటర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్