
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, 30 అక్టోబర్ (హి.స.)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామ పరిధిలోని పంట పొలాల్లో గతంలో గ్యాస్ లీకైన ప్రాంతంలోనే తిరిగి లీకేజీ చోటుచేసుకుంది. ఈ నెల 26వ తేదీన ఇదే ప్రాంతంలో గ్యాస్ బయటకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అదే ప్రదేశంలో లీక్ కావడం గ్రామస్తుల్లో భయాన్ని పెంచింది.
స్థానికుల సమాచారం ప్రకారం రాత్రి నుంచి పంట పొలాల్లో గ్యాస్ బయటకు వస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన ఘటన నేపథ్యంలో మళ్లీ లీకేజీ జరగడంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు నిపుణుల బృందాన్ని ఘటనాస్థలికి పంపించారు. ప్రస్తుతం లీకేజీని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. నిపుణుల పర్యవేక్షణలో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరుసగా ఒకే ప్రాంతంలో గ్యాస్ లీకేజీ చోటుచేసుకోవడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్