
అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నేడు రాత్రి 11:51 గంటలకు GSLV-F18 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
సుమారు 2,232 కిలోల బరువున్న NVS-03 ఉపగ్రహం భారతదేశ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న నావిగేషన్ సేవల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, కచ్చితమైన స్థాన సమాచారాన్ని అందించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.
ఈ ఉపగ్రహం ప్రయోగించిన తర్వాత సుమారు 13 ఏళ్ల పాటు అంతరిక్ష కక్ష్యలో కొనసాగుతూ సేవలు అందించనుందని అంచనా. నావిగేషన్ రంగంలో స్వదేశీ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసుకునే దిశగా ఈ ప్రయోగం ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్