అర్నబ్ తుపాను నష్టంపై పవన్ కల్యాణ్ వర్చువల్ సమీక్ష
అర్నబ్ తుపాను కారణంగా కాకినాడ జిల్లాలో జరిగిన నష్టంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
Pavan Kalyan


కాకినాడ , 30 అక్టోబర్ (హి.స.)

అర్నబ్ తుపాను కారణంగా కాకినాడ జిల్లాలో జరిగిన నష్టంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలు, ప్రజలకు అందుతున్న సాయంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా చర్చించారు. తుపాను కారణంగా మత్స్యకారులకు కలిగిన నష్టం, వారి జీవనోపాధిపై పడిన ప్రభావం, ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయంపై సమీక్షించారు. బాధితులకు అవసరమైన సాయం అందించే విషయంలో తీసుకుంటున్న చర్యలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తుపాను వల్ల జరిగిన నష్టం, ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కూడా సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ వర్చువల్ సమీక్షలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు, రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు. తుపాను బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande