
ఎన్టీఆర్ జిల్లా, 30 అక్టోబర్ (హి.స.)
ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. జి.కొండూరు మండలం పినపాక సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.
డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ కుక్క రోడ్డుపైకి వచ్చింది. దానిని ఢీకొట్టకుండా తప్పించేందుకు ప్రయత్నించడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి బస్సులో ఉన్నవారికి సహాయం అందించారు. గాయపడిన డ్రైవర్, ఇద్దరు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పాఠశాల బస్సుల నిర్వహణ, డ్రైవర్ల అప్రమత్తత, విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పాఠశాల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్