
హైదరాబాద్ , 30 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ మహానగరంలో రాబోయే రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో జలమండలి, ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, రాష్ట్రంలోని 365 మండలాల్లో కరవు ప్రకటించడంతో నీటి మూలాలు దారుణంగా పడిపోయాయి. నగరానికి ప్రధానంగా నీటిని అందించే జంట జలాశయాలు, గోదావరి, కృష్ణా నీటితో పాటు మంజీరా, సింగూరు ప్రాజెక్టుల నుంచి గణనీయమైన స్థాయిలో నీటి సరఫరా జరుగుతుంటుంది. అయితే ప్రస్తుతం సింగూరులో దాని పూర్తి సామర్థ్యమైన 29.91 టీఎంసీలకు గానూ కేవలం 3.029 టీఎంసీలు, మంజీరాలో 1.50 టీఎంసీలకు కేవలం 0.19 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఈ రెండు ప్రాజెక్టుల్లో కేవలం 10 శాతం మాత్రమే నీరు మిగిలింది. నీటి ఆవిరి, సరఫరాలో జరిగే లీకేజీలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం ఉన్న నిల్వలు రాబోయే 60 రోజులకు మాత్రమే సరిపోతాయని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.
దీని ప్రభావం నగరం పరిధిలోని దాదాపు 9 కీలక నియోజకవర్గాలపై పడనుంది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు, ఖైరతాబాద్ (ఎర్రమంజిల్, సోమాజిగూడ, బంజారాహిల్స్), జూబ్లీహిల్స్ (యూసుఫ్‌గూడ, బోరబండ), కార్వాన్ (షేక్‌పేట, టోలీచౌకీ), సనత్‌నగర్, రాజేంద్రనగర్ మరియు కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో మంజీరా పైపులైన్ల ద్వారా నీరు సరఫరా అవుతుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుతం అధికారులు రోజు విడిచి రోజు 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గోదావరి ఫేజ్-1 (ఎల్లంపల్లి జలాశయం) నుంచి నీటిని మంజీరా పైపులైన్లకు అనుసంధానించే పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 17.70 టీఎంసీల నీరు అందుబాటులో ఉండటంతో, ఆ నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకే రిజర్వ్ చేయాలని భావిస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో ఈ పైపులైన్ అనుసంధాన పనులు పూర్తయితే నగరవాసులకు తాగునీటి సమస్య తీరే అవకాశం ఉందని అధికారులు నివేదించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్