దసరా శరన్నవరాత్రులకు 3,500 మంది పోలీసులతో భారీ భద్రత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
AP Police


విజయవాడ , 04 అక్టోబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

ఈసారి ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 3,500 మంది పోలీసు సిబ్బందిని భద్రత కోసం వినియోగించనున్నారు. 22 పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేయడంతో పాటు బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలు, క్రౌడ్ అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు.

భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేయనున్నారు.

AI ఆధారిత డిస్ప్లే బోర్డుల ద్వారా భక్తులకు అవసరమైన సమాచారం అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

కృష్ణానది ఘాట్ల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం షవర్ సదుపాయాలు, వైద్య సహాయం, తాగునీరు, పారిశుద్ధ్య చర్యలను అందుబాటులో ఉంచనున్నారు. పున్నమి ఘాట్ వద్ద నేషనల్ సరస్ మేళా కూడా నిర్వహించనున్నారు.

దసరా సందర్భంగా విజయవాడకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నందున ఈసారి ట్రాఫిక్ నిర్వహణపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తుల దర్శనం సులభంగా పూర్తయ్యేలా క్యూ లైన్లు, హోల్డింగ్ ప్రాంతాలు, పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande