నేరస్థుల్లో చావు భయం పుట్టించాలి.. అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్స్
నేరాలకు పాల్పడితే తప్పకుండా శిక్ష తప్పదనే భయాన్ని నేరగాళ్లలో కలిగించాలని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది
Supreme court


న్యూఢిల్లీ, 05 అక్టోబర్ (హి.స.)

నేరాలకు పాల్పడితే తప్పకుండా శిక్ష తప్పదనే భయాన్ని నేరగాళ్లలో కలిగించాలని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. లైంగిక నేరాలకు పాల్పడే వారిలో ప్రాణభయం కలిగించేలా ఢిల్లీ పోలీసులు పనిచేయాలని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇటీవల నమోదైన అత్యాచార కేసులపై సోమవారం సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ముందుగా కాలేజీలపై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించింది. అమ్మాయిలను వేధిస్తూ తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. అనంతరం ఢిల్లీలోని వేలాది అక్రమంగా నిర్వహిస్తున్న తినుబండారాల కేంద్రాలపై దృష్టి సారించాలని పేర్కొంది. ఇలాంటి ప్రాంతాల్లో సంఘవిద్రోహ శక్తులు గుమిగూడుతున్నాయని, అక్కడ మద్యం కూడా అందుబాటులో ఉంటోందని కోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక నేరానికి పాల్పడితే ప్రాణాలతో ఉండలేమనే భయాన్ని సంఘవిద్రోహ శక్తుల్లో కలిగించాలి. 'ఇకపై ఏదైనా చేస్తే చచ్చిపోతాం' అనే భయం ఉండాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా ఇటీవల మైనర్ బాలికను స్లీపర్ బస్సులో సామూహిక అత్యాచారం చేసిన ఘటనతో పాటు ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నమోదైన అత్యాచార కేసులను ప్రస్తావించిన ధర్మాసనం.. ఇలాంటి నేరాలను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande