ఐపీఎల్ షెడ్యూల్ మార్చాలంటున్న లలిత్ మోడీ.. మద్దతు తెలిపిన జుహీ చావ్లా
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) ఐపీఎల్ ఎప్పుడు పెట్టాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏటా ఎండాకాలంలో, అంటే ఏప్రిల్ - మే మధ్య జరిగే ఈ టోర్నీని ఏకంగా జనవరిలోనే నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచనకు కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని జూహీ చావ్లా జై కొట్టారు. ఈ వ
IPL


హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)

ఐపీఎల్ ఎప్పుడు పెట్టాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏటా ఎండాకాలంలో, అంటే ఏప్రిల్ - మే మధ్య జరిగే ఈ టోర్నీని ఏకంగా జనవరిలోనే నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచనకు కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని జూహీ చావ్లా జై కొట్టారు. ఈ విషయంలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ చెప్పిన మాటకు ఆమె పూర్తిగా ఏకీభవించారు. భరించలేని ఎండల్లో ఆడటం కంటే చల్లటి వాతావరణంలో మ్యాచ్లు జరిగితే ఆటగాళ్లకే కాదు, చూడ్డానికి వచ్చే జనాలకు కూడా హాయిగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసే అతిపెద్ద టోర్నీగా మారిపోయిందని లలిత్ మోదీ అన్నారు. అలాంటప్పుడు క్రికెట్ క్యాలెండర్ను చూసి ఐపీఎల్ డేట్స్ పెట్టడం కాదు, ఐపీఎల్కు తగ్గట్టుగా క్యాలెండర్నే మార్చుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్, మేలో ఉండే విపరీతమైన వేడి ఆటగాళ్లను, స్టేడియంకు వచ్చే అభిమానులను బాగా ఇబ్బంది పెడుతోందని చెప్పారు. టోర్నీని కొంచెం ముందుగా మొదలుపెడితే ఆహ్లాదకరమైన వాతావరణంలో మ్యాచ్లు ఆడొచ్చని, ఇది టీవీ ప్రసారాలకు కూడా కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై జూహీ చావ్లా ఎక్స్లో స్పందిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీని ఏడాదిలో అత్యంత వేడిగా ఉండే రోజుల్లోనే ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ఐపీఎల్ ఇంత పెద్దదయ్యాక దాని షెడ్యూల్లోనూ మార్పు రావాల్సిన టైం వచ్చేసిందని అన్నారు. జనవరిలో పెడితే ఆటగాళ్లకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని, దానివల్ల మ్యాచ్ల క్వాలిటీ కూడా పెరుగుతుందని, అభిమానులకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పారు. టోర్నీ పెరుగుతున్నప్పుడు దాన్ని నిర్వహించే విధానం కూడా మారాలని ఆమె సూచించారు.

అయితే ఈ విషయంలో బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ టోర్నీని ముందుగా మొదలుపెట్టే విషయంపై లోపల చర్చ జరుగుతోందని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఇంతకుముందు పీటీఐతో చెప్పారు. మే 15 తర్వాత వర్షాలు, ప్రీ మాన్సూన్ జల్లుల భయం ఉంటుందని, అటు ఎండల తీవ్రత కూడా అందరికీ కష్టంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande