
అమరావతి , 14 నవంబర్ (హి.స.)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ రానున్న కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయి. ఈ నెల 18వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నెల 18న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 19న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
ఈ నెల 16 నుంచి తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు ఆదివారం సాయంత్రంలోగా తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 16వ తేదీ నుంచి ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్