
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)
అమెరికాలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రతాపరమైన కారణాలతో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకటించింది. అసాధారణ పరిస్థితులు తలెత్తడంతో విమానాశ్రయాల్లో గ్రౌండ్స్టాప్ విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో ఏర్పడిన కమ్యూనికేషన్ సమస్యలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అమెరికాలోని 22 ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు గుర్తించారు. దీంతో విమానాల రాకపోకలను సురక్షితంగా నిర్వహించడం కష్టంగా మారడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారమయ్యే వరకు విమాన సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా, అమెరికాలో విమానయాన వ్యవస్థ ఆధునికీకరణపై కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న పాత రాగి తీగల స్థానంలో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, పాత రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థల్లో మార్పులు చేయనున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి అదనంగా 30 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని సీన్ డఫీ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్