
అమరావతి , 14 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించనున్న డీఎస్సీ-2026 దరఖాస్తుల ప్రక్రియకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తొలిరోజే 397 మంది అభ్యర్థులు మొత్తం 487 పేపర్లకు దరఖాస్తు చేసుకోవడం విశేషం. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నెల 30వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. గడువు ముగిసేలోగా అర్హత కలిగిన అభ్యర్థులంతా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డీఎస్సీకి సంబంధించిన అర్హతలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వెబ్సైట్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్